Wednesday, July 20, 2016

నాన్నా... సారీ...

ఈ రోజు (జూలై 19) మా నాన్నగారి పుట్టినరోజు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఇష్టమే కాదు అపారమైన గౌరవం కూడా. ఎందుకంటే నేను పుట్టి, ఎదుగుతూ మా నాన్న చేసే పనులను అనుకురిస్తూ ఉండేవాడిని. కాని నేను మా నాన్నపై నా ఇష్టాన్ని చూపిన క్షణాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు.

చిన్నప్పుడు నేను చాలా సినిమాల్లో చూసి, మా నాన్నతో నా అన్ని సందేహాలు, సమస్యలు చర్చించవచ్చు అని భావించేవాడిని. కాని వాస్తవానికి మా నాన్నగారు నవ్వుతూ ఉండే సమయం కంటే గంభీరంగా ఉండే సమయం ఎక్కువగా ఉండేది.

చిన్నతనంలో నేను మా నాన్నగారితో నేరుగా మాట్లాడటానికి చాలా భయపడేవాడిని. దానికి కారణం నా కుటుంబ నేపథ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ మా నాన్నగారు వాళ్ల నాన్నగారితో మాట్లాడటానికి జంకుతారు తెలుసా! అంటే అది భయం కాదు అపారమైన గౌరవం.

అంటే నేను చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకోవటానికి లేదా సినిమా చూడటానికి మరో ఊరు వెళ్లాలనుకుంటే, కనీసం రెండు రోజుల ముందు నుండే దానికి సరైన సమయం కోసం కాచుకుని కూర్చునే వాడిని. ఎందుకంటే మా నాన్నగారు నవ్వుతూ ఉన్నప్పుడు చెప్పినట్లయితే దాదాపు 99% నా కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. మరొక విషయం మాది కిరాణా వ్యాపారం, అందుకే మా నాన్నగారు పలు లావాదేవీలు, పెట్టుబడి, సరుకు వివరాలు వంటి అంశాలతో ఎప్పుడూ చాలా బిజీగా ఉండేవారు. అందుకే మా నాన్నగారు దుకాణంలో ఉన్నప్పుడు నేను అడిగినట్లయితే, నా వీపు విమానమోత మోగిపోయేది. అప్పుడు అనుకునేవాడిని నాకు ఎందుకు ఈయన నాన్నగా పుట్టారు అని.. (:)).. దేవుడికి అస్సలు దయలేదు అనేవాడిని.

కానీ ఈ రోజు నేను నా జీవితాన్ని సౌకర్యవంతంగా, సంతోషంగా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపుతున్నాను అంటే అది ఆయన నాకు పెట్టిన బిక్షే అని చెప్పాలి. ఆ రోజు ఆయన అంత కఠినంగా వ్యవహరించారు కాబట్టి ఈ రోజు నేను నెలకు ఆరు అంకెల వేతనాన్ని తీసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఆయన నేను కష్టపడి చదవాలని భావించిన రీతిలో చదివినట్లయితే నేను నేడు ఏ స్థాయిలో ఉండేవాడినో అని ఆలోచించినప్పుడల్లా నాపై నాకు కోపం వస్తుంది.. ఎందుకంటే ఆయన భావించిన దానిలో 10% కష్టపడితేనే, నేడు ఈ స్థాయిలో ఉన్నాను. ఏమైనా మా నాన్నగారు నిజంగా గ్రేట్... మనస్ఫూర్తిగా ఆయన పట్ల నా గౌరవం వంద రెట్లు పెరిగింది.....

నాన్నలు సాధారణంగా బయటకు కఠినంగా కనిపించినప్పటికీ వారి పిల్లలపై అపారమైన ప్రేమను కలిగి ఉంటారు. నాన్నలు ఎప్పుడూ పిల్లలు సక్రమంగా చదువుకుని, మంచి భవిష్యత్తు పొందాలని తపనపడుతుంటారు. కాని పిల్లలకు వారి నాన్న ఎప్పుడూ కోపంగా, చదవకపోతే కొడుతూ ఉంటాడని ఫిర్యాదు చేస్తుంటారు. అందుకే అమ్మతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అమ్మలు చదవకపోయినా బాధపడరు, కాని తినకపోతే బాధపడతారు. అందుకే అమ్మలు అంటే చాలా మంది పిల్లలకు ప్రాణం. కాని నాన్న బాధ్యతను వారు అర్థం చేసుకోరు.

జీవితంలో నాన్న స్థానానికి చేరుకున్నప్పుడు మాత్రమే పిల్లలు వాళ్ల నాన్న యొక్క తపన, కష్టం, బాధ్యతలను అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రిని. నా కూతురు (2 ఏళ్లు) అంటే నాకు ప్రాణం కాదు కాదు అంతకంటే ఎక్కువ. కాని నేను నా కూతురుతో గడిపే క్షణాలు చాలా తక్కువ ఎందుకంటే నేను ఉదయాన్నే అది లేవకముందే ఆఫీసుకు వచ్చేస్తాను.. మళ్లీ సాయంత్రం నేను ఇంటికి చేరుకునే సరికి అది నిద్రమత్తుతో ఉంటుంది. నేను దానిని డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక దాని దగ్గరిగా కాస్సేపు కూర్చుని తర్వాత నా పనులను నేను ప్రారంభిస్తాను. శనివారం, ఆదివారాలు వస్తే మాత్రమే నాకు పండగ ఎందుకంటే నేను నా తల్లి (మా అమ్మాయి)తో ఆడుకోవచ్చు. అది చేసే అల్లరి చూస్తుంటే అమ్మో! నాకు ఆ రెండు రోజుల సమయం సరిపోదు అనిపిస్తుంది... అది చెప్పే బుజ్జి బుజ్జి మాటలు, పలికే విధానం.. జీవితానికి ఇంకేమి కావాలి చెప్పండి..

ఇప్పుడు ఈ వయస్సులో నాకు అర్థమవుతుంది... నాన్న అంటే ఏమిటో... నాన్న అంటే బయటకు బాధ్యత మాత్రమే కనిపిస్తున్నా... అంతర్గతంగా అపారమైన ప్రేమ ఉంటుందని... ఆ ప్రేమను వ్యక్తపరచడానికి వారికి సరైన సమయం చిక్కదని...

ఏమైనా మా నాన్న నిజ్జంగా గ్రేట్.. నాన్నగారు... మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ఇలానే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని.. మాతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ...

మీ ప్రేమను అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేసిన
మీ తనయుడు

Tuesday, September 15, 2009

ఉపోద్ఘాతం

నేను ఏదో వ్రాయాలని...